నియమనిష్ఠలతో క్షేత్ర దర్శనం
భగవంతుడు తన భక్తులకు అందుబాటులో ఉండటం కోసం .. వాళ్ల సేవలను పొందుతూ అనుగ్రహించడం కోసం అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అలా ఆ దైవం కొలువైన ప్రతి ప్రదేశం పుణ్య క్షేత్రంగా అలరారుతోంది. పుణ్యక్షేత్రాలను ఎంతోమంది మహర్షులు దర్శించి వుంటారు. మరెంతోమంది మహా భక్తులు అక్కడి స్వామిని దర్శించుకుని తరించి వుంటారు. ఈ కారణంగా ఆయా ప్రదేశాలు మరింత పవిత్రమై, ఆ ప్రదేశంలో అడుగుపెట్టగానే ఆధ్యాత్మిక భావాలను అంకురింపజేస్తుంటాయి.
తెలిసీ తెలియక చేసిన పాపాలు .. కర్మ ఫలితంగా కలిగే దోషాలు పుణ్యక్షేత్ర దర్శన వలన తొలగిపోతాయి. అయితే అలాంటి క్షేత్రాలను దర్శించినప్పుడు, అక్కడి ఆచారవ్యవహారాలను తప్పక పాటించవలసి ఉంటుంది. భక్తి ప్రధానమే అయినా నియమ నిష్ఠలను కలిగి ఉండవలసిందే. పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి, అక్కడి తీర్థంలో స్నానం ఆచరించి .. దైవ దర్శనం చేసుకుని తిరిగి వచ్చేంత వరకూ ఎక్కడా ఎలాంటి పాపం చేయకుండా .. అలాంటి ఆలోచనే కలగకుండా జాగ్రత్తగా నడచుకోవాలి. ఆ తరువాత కూడా అలాంటి మార్గంలోనే కొనసాగాలి. ఎందుకంటే ఇతర ప్రదేశాల్లో చేసిన పాపం ఏదైనా ఉంటే అది పుణ్యక్షేత్ర దర్శనం వలన తొలగిపోతుంది. పుణ్యక్షేత్రంలో చేసిన పాపం మాత్రం ఏ విధంగానూ నశించదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.