శ్రీనివాసుడే ఇలా పూజలు అందుకుంటున్నాడట!

శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీనివాసుడు అనేక లీలా విశేషాలను చూపించాడు. అలా ఆయన చూపిన ఒక లీలా విశేషానికి గుర్తుగా చిత్తూరు జిల్లాలోని చిన్నగొట్టిగల్లు మండలం 'రంగన్నగారి గడ్డ'లో 'ఎరుకలమ్మ' ఆలయం కనిపిస్తుంది. ఆకాశరాజు కూతురైన పద్మావతి దేవికి శ్రీనివాసుడు మనసిస్తాడు. ఆమెనే వివాహం చేసుకుంటానని పట్టుపడతాడు. ఈ విషయంలో ఆకాశరాజును ఒప్పించమని వకుళ మాతను కోరతాడు. ఆమె శ్రీనివాసుడి మనసును అర్థం చేసుకుంటుంది. అయితే ఆకాశరాజు స్థాయి వారితో ఆశ్రమవాసుల వివాహం సాధ్యమేనా? అనే సందేహంతో ఆమె సతమతమై పోతుంటుంది.

అప్పుడు శ్రీనివాసుడు ఎరుకలమ్మ రూపంలో వచ్చి ఆమెను కలిసి, ప్రయత్నం చేయమనీ .. వెళ్లిన పని తప్పకుండా అవుతుందని చెబుతాడు. అలాగే ఆకాశరాజు దగ్గరికి ఎరుకలమ్మగా వెళ్లి .. మరి కాసేపట్లో పద్మావతికి ఒక సంబంధం రానుందనీ .. దానిని ఖాయం చేయడం అన్ని విధాలా మంచిదని చెబుతుంది. శ్రీనివాసుడు సామాన్య మానవుడు కాదనే సంకేతాలను ఇస్తుంది. పద్మావతీ దేవికి ఆయనంటే ఎంత ప్రేమన్నది స్పష్టం చేస్తుంది. అలా పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణం జరగడానికి స్వామి వారు 'ఎరుకలమ్మ' రూపంలో నాటకాన్ని నడిపించాడు. అలా ఆ రూపంలో స్వామి వారు కొలువైన క్షేత్రంగా 'రంగన్నగారి గడ్డ' విశేషాన్ని సంతరించుకుంది. స్వామివారు తన మనసులోని కోరికను .. అమ్మవారి మనసులోని కోరికను నెరవేర్చుకోవడానికి ఈ రూపాన్ని ధరించాడు గనుక, ఈ తల్లిని దర్శించుకునే వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అంకిత భావంతో సేవించి తరిస్తుంటారు.


More Bhakti News