అదే ఇక్కడి సాయినాథుడి ప్రత్యేకత
సాయినాథుడు శిరిడీ గ్రామంలో తిరిగే కాలంలోనే, తనని నమ్మిన భక్తులకు అండగా నిలుస్తూ వచ్చాడు. ఆయన పట్ల విశ్వాసం ఉంచిన భక్తులకు నేటికీ ఆయన సాయం అందుతూనే వుంది. ఆయన లీలా విశేషాలను గురించి భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఆయనని తమ ఇలవేల్పుగా భావించి అంకితభావంతో ఆరాధిస్తుంటారు.
భక్తులంతా కలిసి ఆయన ఆలయాలను నిర్మించుకుని .. అనుదినం ఆ కరుణామయుడి దర్శనం చేసుకుని తరిస్తుంటారు. అలాంటి బాబా ఆలయాలలో ఒకటి చిత్తూరు జిల్లాలోని 'కట్టమంచి'లో కనిపిస్తుంది. విశాలమైన ప్రదేశంలో భారీస్థాయిలో నిర్మించిన ఈ ఆలయం ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి అవసరాన్నయినా .. ఆపదనైనా గట్టెక్కించడానికి తాను వున్నాను అన్నట్టుగా అభయమిస్తూ బాబా మూర్తి కనిపిస్తూ ఉంటుంది.
ఇక్కడి బాబాను హిందువులు మాత్రమే కాదు .. ముస్లింలు .. క్రైస్తవులు కూడా పూజిస్తుంటారు. మూడు మతాలకి సంబంధించిన వేడుకలను నిర్వహిస్తుండటం ఇక్కడి ప్రత్యేకత. మత సామరస్యానికి ప్రతీకగా ఈ ఆలయం అలరారుతోంది. శిరిడీలో మాదిరిగానే బాబాకు పూజలు .. సేవలు ఘనంగా జరుపుతుంటారు. భజనలు .. హారతులతో ఆలయం ఎప్పుడూ సందడిగా కనిపిస్తూ ఉంటుంది. మనసుకు ప్రశాంతతను చేకూర్చే ఈ ఆలయాన్ని దర్శించుకోవడం, మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది.