ఈ క్షేత్రంలో నిద్ర చేస్తే చాలు
నరసింహస్వామి కొలువైన ప్రాచీన క్షేత్రాల్లో ఒకటిగా నల్గొండ జిల్లా హుజూర్ నగర్ మండలంలోని 'మట్టపల్లి' కనిపిస్తుంది. సాధారణంగా నరసింహస్వామి లక్ష్మీదేవి సమేతుడై ఆయా క్షేత్రాల్లో దర్శనమిస్తుంటాడు. అలా కాకుండా ఇక్కడ తన భక్తుడైన ప్రహ్లాదుడితో కలిసి పూజలు అందుకుంటున్నాడు. తన భక్తుడైన మాచిరెడ్డికి కలలో స్వామి కనిపించి వెలుగులోకి వచ్చాడు. అందువలన భక్తులు పిలిస్తే పలికే దైవంగా ఇక్కడి స్వామివారిని గురించి చెప్పుకుంటూ వుంటారు.
సాధారణంగా ఆపదల్లో వున్నప్పుడు .. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో వున్నప్పుడు .. అనారోగ్యంతో అవస్థలు పడుతున్నప్పుడు .. వస్తురూపంలో ఫలానావి చెల్లించుకుంటామని భక్తులు ఆయా దైవాలకు మొక్కుకోవడం జరుగుతుంటుంది. కానీ ఇక్కడ స్వామి విషయంలో భక్తులు నిద్ర చేస్తామని మొక్కుకుంటూ వుంటారు. ఈ క్షేత్రంలో నిద్ర చేస్తామని మొక్కుకుంటే చాలు, ఎలాంటి కష్టమైనా తొలగిపోతుందని భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు. అలా మొక్కుబడులు చెల్లించుకునే భక్తులు ఇక్కడ భారీ సంఖ్యలో కనిపిస్తుంటారు.