అత్యాశ లేనివారే ధనవంతులు
దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఆశ అనేది లేకపోతే ఎవరూ ఏ కార్యాన్ని తలపెట్టరు .. ఏ రంగంలోనూ అభివృద్ధిని సాధించలేరు. అందువలన ఎవరికైనా ఆశ అవసరమే. ఆశ కఠిన శ్రమకి .. కార్యసిద్ధికి దారితీస్తే, అత్యాశ మనశ్శాంతిని దూరం చేస్తుంది. అందువలన అత్యాశని విడనాడాలని మహానుభావులు చెబుతుంటారు. ఆశ వలన ఆనందం కలిగితే .. దురాశ వలన దుఃఖం కలుగుతుందని అంటారు.
ఒక వస్తువును సాధించుకున్న తరువాత అంతకన్నా గొప్ప వస్తువును సొంతం చేసుకోవాలనిపిస్తుంది. అలాగే కొంత కూడబెట్టిన తరువాత దానిని రెట్టింపు చేయాలనే అత్యాశకి లోను కావడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో అనుబంధాలను .. ఆత్మీయతలను కూడా మరిచిపోతూ, తమకి తెలియకుండానే ఆనందానికి దూరమవుతుంటారు. అనారోగ్యాన్ని కొని తెచ్చుకుని నానా బాధలు పడుతుంటారు. అందువలన సాధించిన దానితో సంతృప్తిని చెందాలని పెద్దలు చెబుతుంటారు. అత్యాశ కలిగినవాడే దరిద్రుడనీ .. సంతృప్తిని కలిగినవాడే ధనవంతుడని అంటుంటారు.