గురు పాదుకల విశిష్టత
''గురువు ... దేవుడు ఒకేసారి నాకు ఎదురుపడితే, నేను ముందుగా గురువుకే నమస్కరిస్తాను. ఎందుకంటే నాకు ఆ దేవుడిని చూపించినది గురువే'' అని చెప్పాడు కబీరు దాసు. దీనిని బట్టి గురువు యొక్క గొప్పతనం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. రాముడు ... కృష్ణుడు నుంచి రామకృష్ణ పరమహంస ... వివేకానందుడు వరకూ అందరూ గురువును ఆశ్రయించిన వాళ్లే.
అలాంటి గురువుల యొక్క పాదుకలు ఎంతో విశిష్టమైనవి ... మరెంతో మహిమాన్వితమైనవని చెప్పవచ్చు. గురువు పాదాలకు ప్రత్యక్షంగా నమస్కరించడం వలన ఎలాంటి ఫలితం కలుగుతుందో, ఆయన పాదుకలను స్పర్శించడం వలన కూడా అలాంటి ఫలితమే కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. తమకి బదులుగా తమ పాదుకలను పూజించమనీ, తమ పాదుకలు వున్న చోటున తాము ప్రత్యక్షంగా ఉన్నట్టేనని గురువులే స్వయంగా చెప్పిన సందర్భాలు వున్నాయి.
వీరబ్రహ్మేంద్ర స్వామివారు సమాధి చెందిన అనంతరం, ఆయన ఎడబాటుని సిద్ధయ్య భరించలేకపోతాడు. అప్పుడు బ్రహ్మంగారు ప్రత్యక్షమై తన పాదుకలను ఆయనకి ప్రసాదించడాన్ని ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక శిరిడీ సాయిబాబాకి పల్లకీ సేవను ప్రారంభించినప్పుడు, ఆ పల్లకీలో ఆయన కూర్చోకుండా తన పాదుకలను అందులో ఉంచమని చెప్పడం జరిగింది.
ఇక నిరంతరం తన సేవ కోసం ఆరాటపడుతోన్న 'చోళప్ప' అనే భక్తుడికి అక్కల్ కోట స్వామి తన పాదుకలను ఇవ్వడం జరిగింది. ఒకసారి చోళప్ప భార్యకి తేలుకుడితే, ఆ బాధను భరించలేక ఆమె ఆ పాదుకలను పట్టుకుంటుంది. అంతే క్షణాల్లో ఆమె బాధ మటుమాయమైపోతుంది. ఇక నృసింహసరస్వతి స్వామి విషయానికి వస్తే, గురువు పాదుకలు ఎంతటి మహిమాన్వితమైనవనేది చాటిచెప్పాడు.
ఒక రోజున గంగానుజుడు అనే వ్యక్తి తనకి కాశీ ... ప్రయాగ ... గయ చూడాలనివుందని నృసింహసరస్వతి స్వామితో అంటాడు. అయితే తన పాదుకలు పట్టుకోమని చెప్పి, ఆయనకి ఆ మూడు క్షేత్రాలను దర్శింపజేసిన తీరు మనకి 'గురుచరిత్ర'లో కనిపిస్తుంది. దీనిని బట్టి గురువు యొక్క పాదుకలు జ్ఞానభిక్షను పెడతాయనీ ... బాధలను తొలగిస్తాయని ... వివిధ పుణ్య క్షేత్రాలను దర్శించిన ఫలితాన్ని అందిస్తాయని అర్థమవుతుంది.
గురువు పాదుకలు ఇంతటి శక్తిమంతమైనవి కనుకనే 'గురుపౌర్ణమి' వంటి పర్వదినాల్లో, గురు ప్రధానమైన క్షేత్రాలకు వెళ్లి నప్పుడు అక్కడ గల పాదుకలను ముందుగా దర్శించాలి ... గురువు పట్ల అపారమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ తనని ముందుండి నడిపించవలసిందిగా ప్రార్ధించాలి.