శివుడు ఈ గుహలోనే దాక్కున్నాడట !

అసురసంహార సమయంలో ప్రళయ రుద్రుడులా కనిపించే శివుడు, ఆ రాక్షసులే తన కోసం తపస్సు చేసినప్పుడు వాళ్లకు వరాలను ప్రసాదించకుండా ఉండలేకపోయాడు. తన భక్తులు బాధపడకూడదనీ, చిన్నబుచ్చుకోకూడదని వరాలను ప్రసాదించే తీరు ఆయన్నే ఇబ్బందుల్లో పడేసిన సందర్భాలు చాలానే కనిపిస్తాయి. అలాంటివాటిలో భస్మాసురుడికి సంబంధించిన సంఘటన ఒకటిగా చెప్పుకోవచ్చు.

తాను ఎవరి శిరస్సుపై చేయిపెట్టినా వాళ్లు భస్మమైపోయేలా, శివుడు నుంచి వరాన్ని పొందుతాడు భస్మాసురుడు. ఆ వరాన్ని పరీక్షించుకోవడానికి ఆయన శివుడినే ఎంచుకుంటాడు. దాంతో ఆయన బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో శివుడు ఒక గుహలో దాక్కుంటాడు. అలా శివుడు దాక్కున్న గుహ 'పచ్ మఢి' పర్వత ప్రాంతంలో కనిపిస్తుంది.

ఈ ప్రదేశం మధ్యప్రదేశ్ రాష్ట్ర పరిధిలో గల సాత్పుర పర్వత ప్రాంతంలో దర్శనమిస్తుంది. ఇక్కడి నేలబారు ప్రదేశమంతా తపోభూమిని తలపిస్తూ వుంటే, ఎత్తయిన పర్వతాలు దేవభూమిగా కనిపిస్తుంటాయి. ఇక్కడి 'చౌరా ఘడ్' పర్వతంపై, సన్నని ద్వారం గల గుహలోనే శివుడు దాక్కున్నాడని చెబుతుంటారు. భారీ ఆకారాన్ని కలిగిన భస్మాసురుడు, ఆ సందులో నుంచి లోపలికి ప్రవేశించలేకపోతాడు.

ఎలాగైనా లోపలికి వెళ్లితీరాలని ఆయన శతవిధాలా ప్రయత్నిస్తోన్న సమయంలోనే, మోహినీ రూపంలో విష్ణుమూర్తి అక్కడికి చేరుకుంటాడు. భస్మాసురుడిని తెలివిగా మాటల్లో పెట్టి అతన్ని అంతం చేస్తాడు. శివుడు ఇక్కడి గుహలో దాక్కున్నాడనడానికి నిదర్శనంగా, ఇక్కడ 'గుప్త మహాదేవ్' పేరుతో శివలింగం దర్శనమిస్తూ వుంటుంది. ఆసక్తికరమైన పురాణ కథనానికి వేదికగా నిలిచిన ఈ ప్రదేశాన్ని దర్శించగానే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని గుండెల నిండుగా దాచుకోవాలనిపిస్తుంది.


More Bhakti News