ఇక్కడ జపంచేస్తే విశేష ఫలితం లభిస్తుందట !
భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి ఆయన నామజపం కన్నా మించిన సాధనం మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. జపం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని స్పష్టం చేస్తున్నాయి. భగవంతుడి మనసు గెలుచుకోవడానికి ప్రధానమైన సాధనంగా జపాన్ని ఎంచుకోవడమనేది ప్రాచీనకాలం నుంచి వస్తోంది. జపం చేసుకోవడానికి మహర్షులు ... మునులు మొదలైన వాళ్లంతా కూడా నిర్జన ప్రదేశాలను ఎంచుకుంటూ వుండేవాళ్లు.
చుట్టూ వుండే పరిసరాలు మనసుపై ప్రభావం చూపుతూ వుంటాయి. భగవంతుడి యందు మనసును స్థిరంగా నిలపడానికి అందుకు తగిన వాతావరణం వుండాలి. అందువలన వాళ్లు ఆహరం - నీరు లభించేటటువంటి ప్రశాంతమైన .. పవిత్రమైన ప్రదేశాలను ఎంపిక చేసుకుని అక్కడ జపం కొనసాగిస్తూ వుండేవాళ్లు.
ఇక ఈ కాలంలో కూడా నియమనిష్ఠలను ఆచరిస్తూ జపం చేసుకునే వాళ్లు లేకపోలేదు. అయితే మారిన పరిస్థితుల కారణంగా ... జీవన విధానంలో పెరిగిన వేగం కారణంగా ఇప్పుడు జపం అనేది ఇంట్లోనే చేసుకోవలసి వస్తోంది. ఇంటి వాతావరణంలో ఏకాగ్రత కుదరడం కష్టమైన విషయమే. అందువలన జపం చేసుకోవాలని అనుకునే వాళ్లు దగ్గరలోని ఆలయానికి వెళ్లి, అక్కడ జపం చేసుకోవడం వలన మంచి ఫలితమే కనిపిస్తుంది.
దైవ సన్నిధిలో చేసే జపం అత్యున్నతమైన పుణ్యఫలాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఒకవేళ గోశాలలు అందుబాటులో వుంటే అక్కడ జపం చేసుకోవడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. 'గోధూళి' పరమపవిత్రమైనదిగా చెప్పబడుతూ వుందంటే, గోవులు నివసించే ప్రదేశం ఎంతటి పవిత్రతను సంతరించుకుని వుంటుందో అర్థం చేసుకోవచ్చు. అందువలన ఇంటి వాతావరణంలో ప్రశాంతత చిక్కని వాళ్లు ఆలయాలలోగానీ, గోశాలలలో గాని జపం చేసుకోవచ్చు ... విశేషమైన పుణ్యఫలాలను పొందవచ్చు.