నిజమైన భక్తి త్రిమూర్తులను సైతం రప్పిస్తుంది!
పాండురంగస్వామిని సేవించి తరించిన మహా భక్తులలో ఏకనాథుడు ముందువరుసలో కనిపిస్తాడు. విద్య ... వినయం సహజమైన ఆభరణాలుగా ధరించిన ఆయనని అందరూ ఎంతగానో గౌరవించే వాళ్లు. ఆయన పాటకు పరమాత్ముడే పరవశించిపోతాడని భావించేవాళ్లు. ప్రతి ఉదయం పూజలో భాగంగా ఆయనపాడే పాటలు వినడానికి చాలామంది నిరీక్షిస్తూ వుండేవాళ్లు.
అన్ని వర్గాల వారితో ప్రేమగా మసలుకునే ఏకనాథుడుని అందరూ ఓ దేవుడిలానే చూసేవాళ్లు. అలాంటి ఏకనాథుడు ప్రతి రోజు అతిథులకు భోజనం పెట్టిన తరువాతనే తాను భోజనం చేసేవాడు. భోజనం సమయానికి ఎవరైతే తన ఇంటివైపుగా వస్తారో, వాళ్లని దైవ స్వరూపాలుగా భావించి ఆహ్వానించేవాడు.
ఒకరోజున ఎంతగా అతిథుల కోసం నిరీక్షించినా ఎవరూ అటు రాకపోవడం ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నీరసం వస్తున్నా భోజనం చేయకుండా అలాగే అరుగుపై కూర్చుండిపోతాడు. అదే సమయంలో ముగ్గురి పిల్లలు అటుగా రావడంతో, వాళ్లనే అతిథులుగా భావించి ఆహ్వానించి భోజనం వడ్డిస్తాడు. సంతృప్తి కారణగా భోజనం చేసిన తరువాత, వాళ్లని తాను త్రిమూర్తులుగా భావిస్తున్నట్టు చెబుతాడు.
దాంతో పిల్లల రూపంలో వచ్చిన త్రిమూర్తులు ఆయనకి ప్రత్యక్ష దర్శనమిస్తారు. తన జీవితం ధన్యమైనదంటూ వారికి ఏకనాథుడు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆయన భక్తి శ్రద్ధలను ... పవిత్రమైనటువంటి జీవన విధానాన్ని త్రిమూర్తులు ప్రశంసిస్తారు. మానవ సేవలోను ... దైవసేవలోను తరిస్తోన్న ఆయనకి మోక్షం లభిస్తుందంటూ ఆశీర్వదించి అదృశ్యమవుతారు.