స్వామివారు తలచుకుంటే కానిదేముంది ?

అక్కల్ కోట స్వామివారిని అనునిత్యం ఎంతోమంది భక్తులు దర్శించుకుంటూ వుండేవారు. కొంతమంది తమ పరిస్థితిని గురించి చెబుతూ వుంటే ఆయన వినిపించుకోనట్టుగానే వుండేవారు. మరికొంత మంది తమ బాధలు చెబుతూ వుంటే, నవ్వుతూ వినేవారు. ఇంకొందరు తమ సమస్య చెప్పబోతూ వుండగా, ఆయనే వాళ్లు వచ్చిన పనిని గురించి చెప్పేవారు. చివరికి అందరినీ అనుగ్రహించి ఆశ్చర్యపరుస్తూ వుండేవారు.

ఇక తనని విశ్వసించిన వాళ్లు తనతో ఏమీ చెప్పకపోయినా, వాళ్ల ఇంటికి వెళ్లి మరీ కష్టాలను తీర్చిన సందర్భాలు లేకపోలేదు. ఒకసారి ... పేదవాడైనటువంటి తన భక్తుడు ఇంటికి స్వామి వెళతాడు. స్వామి రాక ఆ భక్తుడికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. సాదరంగా స్వామిని ఆహ్వానిస్తాడు గానీ, ఆయనకి సమర్పించడానికి తన ఇంట్లో ఏమీ లేదని బాధపడుతూ ఉంటాడు.

తనకి బాగా ఆకలిగా ఉందనీ ... పాలతో ఏదైనా చేసిపెట్టమని ఆ భక్తుడిని అడుగుతాడు స్వామి. ఆ మాటకి ఆయన బాధపడుతూనే, వున్న ఒక్క ఆవు పాలు ఇవ్వక చాలాకాలమైందని చెబుతాడు. ఆ సమయంలో ఆ ఇంటి ఇల్లాలు కన్నీళ్లు పెట్టుకోవడం స్వామి గమనిస్తాడు. అక్కడ కట్టేసి వున్న ఆవు దగ్గరికి ఆయన వెళ్లి, తన భక్తుడు చాలా కష్టాల్లో ఉన్నాడనీ. పాలు ఇవ్వకుండా మరింత ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని ఆవుతో అంటాడు.

ఇక మీదట బుద్ధిగా పాలు ఇవ్వవలసిందేనని ఆవుతో అంటూ, పితకమని భక్తుడితో చెబుతాడు. అది పాలు ఇవ్వడం చూసి ఆ భక్తుడు ఆశ్చర్యపోతాడు. ఆ పాలతో స్వామికి కావలసినవి ఆనందంగా చేసి పెడతాడు. తమకి జీవనోపాది చూపించడానికే స్వామి తమ ఇంటికి వచ్చాడనే విషయం ఆ దంపతులకు అర్థమైపోతుంది. తమ ఆకలి తీర్చడానికే తనకి ఆకలిగా వుందని చెప్పాడని వాళ్లు గ్రహిస్తారు. ఆ తరువాత నుంచి ఆ పాల మీద వచ్చిన రాబడితో ఆ దంపతులు హాయిగా జీవిస్తారు.


More Bhakti News