అలా స్వామి తన జాడను తెలిపాడట !

రాముడు ... కృష్ణుడు ... శివుడు ... హనుమంతుడు ఇలా ఏ దేవుడైనా స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలను పరిశీలిస్తే, ఒక్కో చోట స్వామివారు ఆవిర్భవించిన తీరు ఒక్కోరకంగా ఆసక్తికరంగా వుంటుంది. అలా స్వామివారు ఆవిర్భవించిన విధానమే ఆ క్షేత్ర మహాత్మ్యంగా భక్తులు చెప్పుకుంటూ వుంటారు ... అక్కడి దైవాన్ని తమ ఇలవేల్పుగా భావించి కొలుస్తుంటారు.

అలా ఒక ఆసక్తికరమైన కథనంతో నృసింహస్వామి బయటపడిన క్షేత్రమే 'సింగోటం'. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో విలసిల్లుతోన్న ఈ క్షేత్రం, ప్రసిద్ధి చెందిన నృసింహస్వామి క్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడుతోంది. ఇక్కడ స్వామి వెలుగుచూసిన తీరు మహిమాన్వితమైనదని స్థానికులు చెబుతుంటారు.

శిలారూపంలో ఒక పొలంలో ఆవిర్భవించిన నృసింహస్వామి, ఆ పొలంలో రైతు పనులకు తరచూ అడ్డుపడుతుంటాడు. అయినా ఆ రైతు ఆ రాయి కదలికనుగానీ, దాని ప్రత్యేకతను గాని గుర్తించలేకపోతాడు. దాంతో స్వామి ఓ భక్తుడికి కలలో కనిపించి తన జాడను తెలుపుతాడు. ఆ భక్తుడు గ్రామస్తులకు విషయం చెప్పి, పొలంలో శిలా రూపంలో వున్న స్వామిని గుర్తించి, ప్రస్తుతం వున్న చోటున ప్రతిష్ఠించడం జరిగింది.

అలా స్వామి తన జాడను తెలిపి వెలుగులోకి రావడం జరిగింది.ఈ కారణంగానే స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని భక్తులు బలంగా నమ్ముతుంటారు. ఇక తనని విశ్వసించిన వాళ్లకు స్వామి ఎన్నో నిదర్శనాలు చూపించాడని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించినా మనసు పులకించిపోవడం ఖాయం.


More Bhakti News