స్వామివారి కోసం తరలివచ్చిన గోదావరి

వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడి పుణ్యతీర్థాలను గురించి కూడా తెలుస్తూ వుంటుంది. ఆ తీర్థాన్ని సేవించి గానీ ... అందులో స్నానమాచరించి గాని దైవదర్శనం చేసుకున్నప్పుడే పరిపూర్ణమైన ఫలితం దక్కుతుందని స్థలపురాణం చెబుతూ వుంటుంది. ఆలయ విశిష్టతలో ప్రముఖమైన పాత్రను పోషించే తీర్థాలను పరిశీలిస్తే ఒక్కో తీర్థం ఆవిర్భవించడం వెనుక ఒక్కో విశేషం దాగివుంటుంది.

అలాంటి విశేషాన్ని సంతరించుకున్నదిగా 'ధవళేశ్వరం' క్షేత్రం దర్శనమిస్తూ వుంటుంది. ఇక్కడ కొలువై వున్న 'జనార్ధనస్వామి'ని అభిషేకించడం కోసమే గోదావరి నది రప్పించబడిందని స్థలపురాణం చెబుతోంది. నారదమహర్షి సంకల్పంతో ... గౌతమమహర్షి ప్రయత్నంతో గోదావరి ఈ ప్రదేశాన్ని పునీతం చేసినట్టుగా చెప్పబడుతోంది.

బ్రహ్మదేవుడి ముఖభాగం నుంచి వెలువడిన వేదాలు ఇక్కడ పర్వత రూపాన్ని సంతరించుకోగా, వ్యాస మహర్షి కోరిక మేరకు స్వామివారు జనార్దనుడుగా ఇక్కడ ఆవిర్భవించాడు. అలా ఆవిర్భవించిన స్వామికి నిత్యం నారదమహర్షి 'కాశీ' నుంచి తెచ్చిన గంగాజలంతో అభిషేకాలు నిర్వహించేవాడు. తన తరువాత వారికి ఇది ఇబ్బందిగా మారుతుందని భావించిన నారదుడు, గౌతమమహర్షి ద్వారా ఇక్కడ గోదావరి పరుగులు తీసేలా చేశాడు.

అలా ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఇక్కడి గోదావరి పవిత్ర జలాలతోనే స్వామివారికి పూజాభిషేకాలు నిర్వహించడం జరుగుతోంది. వైభవంతో ఈ ఆలయం వెలుగొందడానికి తూర్పు చాళుక్యులు తమవంతు కృషిచేసినట్టుగా ఆధారాలు వున్నాయి. దేవతలచే కీర్తించబడి ... మహా భక్తులచే ఆరాధించబడి ... మహారాజులచే పూజించబడిన ఇక్కడి జనార్దనుడుని చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు.

శ్రీదేవి - భూదేవి సమేతంగా స్వామివారు కొలువైన ఈ క్షేత్రంలో 'భీష్మ ఏకాదశి' సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు జరుపుతుంటారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. స్వామివారి వైభవాన్ని కనులారా తిలకిస్తూ తరిస్తారు. ఇక్కడికి రావడం వలన వేదరాశిగా చెప్పబడుతోన్న పర్వతాన్నీ ... వేదరాశిని సంరక్షిస్తూ వుండే జనార్దనస్వామిని ... ఆయనని అభిషేకించడానికి వచ్చిన పవిత్ర గోదావరిని దర్శించిన పుణ్యఫలితం దక్కుతుంది.


More Bhakti News