ఇక్కడి స్వామి మహిమాన్వితుడు !
విశిష్టమైనటు వంటి కొన్ని క్షేత్రాలలో మూలవరులకు అభిషేకం చేయించిన తరువాత, ఆ విగ్రహాలకి చెమట పట్టినట్టుగా నీటి బిందువులు కనిపిస్తాయని అర్చక స్వాములు చెబుతుంటారు. తిరుమలలో శ్రీవారి విగ్రహానికి అభిషేకం చేయించి స్వామివారి విగ్రహాన్ని తుడిచే సమయంలో ఆ విగ్రహం యొక్క స్పర్శ మెత్తగా ఉంటుందనీ, అలా తుడిచిన తరువాత ఆ విగ్రహంపై స్వేద బిందువులు కనిపిస్తాయని అంటారు. ఆ స్వేదం పరిమళభరితంగా ఉండటం గురించి మరింత విశేషంగా చెప్పుకుంటూ వుంటారు.
ఇలాంటి విశేషమే మనకి అనంతపురం జిల్లాలో గల 'కదిరి' క్షేత్రంలోను కనిపిస్తుంది. నరసింహస్వామి ఆవిర్భవించిన అత్యంత శక్తిమంతమైన క్షేత్రాలలో ఇది ఒకటిగా చెప్పబడుతోంది. హిరణ్యకశిపుడిని నరసింహస్వామి సంహరించే దృశ్యం ఇక్కడి గర్భాలయంలో కనిపిస్తూ వుంటుంది. ఇక్కడ తప్ప మరెక్కడా స్వామివారు ఇలా కనిపించకపోవడం విశేషం. ఇక్కడ కూడా స్వామివారికి అభిషేకం చేసి తుడిస్తే, ఆయన విగ్రహంపై స్వేద బిందువులు కనిపిస్తాయని అర్చకులు చెబుతుంటారు.
స్వామివారి విగ్రహం యొక్క స్పర్శ మెత్తగా ఉంటుందనీ, అభిషేకం చేసిన అనంతరం 27 నిమిషాలపాటు స్వామివారి వంటిపై స్వేదబిందువులు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయని అంటారు. ఈ కారణంగానే ఇది మహిమాన్వితమైన క్షేత్రమనీ, స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.