లక్ష్మీదేవి ఇక్కడ కొలువై ఉంటుందట !

ఒకసారి లక్ష్మీదేవి కాస్త అసహనంగా ఉండటం గమనించిన ఇంద్రుడు, అందుకు గల కారణమేమిటని అడుగుతాడు. అసురుల జీవన విధానంలో చాలా మార్పు వచ్చిందనీ, వాళ్లు సత్కార్యాలకు పూర్తిగా స్వస్తి పలికారని చెబుతుంది లక్ష్మీదేవి. తాను ఏ కారణాలను చూసి అప్పటి వరకూ వారిని అనుగ్రహిస్తూ వచ్చానో, వాటినే వాళ్లు పూర్తిగా విస్మరించారని అంటుంది. అందువల్లనే తాను వారి స్థానాలను వదిలి వచ్చేశానని చెబుతుంది.

దాంతో ఎలాంటి చోట ఉండటానికి ఆమె ఇష్టపడుతుందో, ఆమె రాకని ఆశించే వాళ్లు ఎలాంటి పద్ధతులను పాటిస్తూ ఉండాలో వివరించవలసిందిగా ఇంద్రుడు కోరతాడు. దాంతో ఆయనకి లక్ష్మీదేవి ఈ విధంగా చెప్పడం మొదలుపెడుతుంది. ఏ ఇంటి వాకిట్లో ముగ్గు వుంటుందో ... ఏ ఇంటి గుమ్మానికి పచ్చని మామిడి తోరణాలు ఉంటాయో ... ఏ ఇంటి గడప పసుపు కుంకుమలతో అలంకరించి వుంటుందో ఆ ఇంట్లో అడుగుపెట్టడానికి తాను ఇష్టపడతానని లక్ష్మీదేవి చెబుతుంది.

అనునిత్యం దీపారాధన చేసే చోట ... తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి పూజించే చోట తాను ఉండటానికి ఆసక్తిని చూపుతానని అంటుంది. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో ... బ్రాహ్మణులు పూజించబడతారో అక్కడ తాను కొలువై ఉంటానని చెబుతుంది. ఎవరైతే గురువులను నిందించకుండా ... పెద్దలను అవమాన పరచకుండా వుంటారో, అక్కడ తాను వుండిపోతానని అంటుంది.

తన రాకని కోరుకునే వాళ్లు దానధర్మాలను చేస్తూ, పవిత్రమైన జీవన విధానాన్ని కొనసాగిస్తూ వుండాలని సెలవిస్తుంది. నీతి నియమాలకు కట్టుబడిన వాళ్లు వుండే చోట ... అతిథులను సేవించే వాళ్లున్న చోట తాను స్థిరనివాసం ఏర్పరచుకుంటానని స్పష్టం చేస్తుంది.


More Bhakti News