ఇక్కడి స్వామి అనుగ్రహం ఇలా లభిస్తుంది !
ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగిన వాళ్లెవరూ భగవంతుడిని ఆరాధించకుండా ఉండలేరు. భగవంతుడి పట్ల వాళ్లు అపారమైన విశ్వాసాన్ని కలిగి వుంటారు. తమ బాగోగులను ఆయనే చూస్తుంటాడని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో కొంతమంది కోరికలు నెరవేరకపోయినా, వాళ్లు బాధపడతారే గాని భగవంతుడిని నిందించరు. ఆ దేవుడు చూపించే మార్గం కోసం వాళ్లు ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు.
ఫలానా కోరిక నెరవెరాలంటే, ఫలానా క్షేత్రాన్ని దర్శించమని ఎవరైనా చెబితే, అది ఆ దేవుడు అందించిన సమాచారంగా భావించి వాళ్లు అక్కడికి బయలుదేరుతుంటారు. అలా భక్తుల కోరికలను నెరవేర్చే క్షేత్రాల జాబితాలో తూర్పు గోదావరి జిల్లా .. పెద్దాపురం మండలానికి చెందిన 'తిరుపతి' దర్శనమిస్తుంది. ధృవుడికి ప్రత్యక్ష దర్శనమిచ్చినట్టుగా చెప్పబడుతోన్న ఇక్కడి స్వామివారు 'శృంగార వల్లభుడు'గా పూజలందుకుంటూ వుంటాడు.
మనసులోని కోరికను స్వామివారికి విన్నవించాలని అనుకునే వాళ్లు ముందుగా ఇక్కడి బావిలోని నీటితో స్నానం చేయవలసి వుంటుంది. ప్రాచీనకాలానికి చెందినదిగా చెప్పబడుతోన్న ఓ 'బావి' ఆలయ ప్రాంగణంలో కనిపిస్తూ వుంటుంది. ఈ బావిలోని నీటితో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే, మనసులోని కోరిక తప్పక నెరవేరుతుందని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.
పాపాలను కడిగివేసే పవిత్రత ఈ బావిలోని నీటికి వుందనీ, ఆ నీటితో స్నానం వలన పాపాల బారి నుంచి బయటపడి భగవంతుడి సన్నిధిలో అడుగుపెడితే ఆయన వెంటనే అనుగ్రహిస్తాడని చెబుతారు. ఈ కారణంగానే ధర్మబద్ధమైన ఏ కోరిక అయినా అనతికాలంలోనే నెరవేరుతుందని అంటారు. ఎవరి ఎత్తుకి తగినట్టుగా వారికి ఇక్కడి మూలమూర్తి కనిపించడం ఒక ప్రత్యేకత అయితే, మరో ప్రత్యేకతగా ఇక్కడి బావి నీటి స్నానం చెప్పబడుతోంది. ఈ కారణంగానే ఈ క్షేత్రం విశిష్టమైనదిగా విలసిల్లుతోంది.