ఆదిదేవుడిని ఆవుపాలతో అభిషేకిస్తే ?
అంకిత భావంతో ... అసమానమైన భక్తి శ్రద్ధలతో తనని పూజించిన వారెవరైనా, అనుగ్రహించడంలో ఆదిదేవుడు ఎంతమాత్రం ఆలస్యం చేయడు. ఈ కారణంగానే దేవతలతో పాటు దానవులు కూడా ఆయనని ఆరాధించి తమకి కావలసిన వరాలను పొందారు. మహర్షులతో పాటు మరెంతో మంది భక్తులు ఆయన కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రులయ్యారు.
సాధారణంగా పరమశివుడిని ఆనందింపజేయడానికి అభిషేకమే మార్గమని భక్తులంతా భావిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయనకి తేనెతోను ... కొబ్బరినీళ్ల తోను ... చెరుకురసంతోను ... పండ్ల రసాలతోను అభిషేకాలు చేస్తుంటారు. ఇలా వివిధ అభిషేక ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించడం వలన ఆయన సంతోషపడిపోయి సంతృప్తి చెందుతాడట. ఒక్కో అభిషేక ద్రవ్యంతో అభిషేకం చేయడం వలన ఒక్కో ఫలితాన్ని ప్రసాదిస్తాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
పరమశివుడిని ఆవుపాలతో అభిషేకించడం వలన, సమస్త దుఖాల నుంచి విముక్తి లభిస్తుందని చెప్పబడుతోంది. నిత్య జీవితంలో దుఃఖమనేది ఒక్కొక్కరినీ ఒక్కోలా వెంటాడుతూ వుంటుంది. అత్యంత ముఖ్యమైన కార్యాలలో విజయాన్ని సాధించలేకపోవడం ... అనుకున్న గమ్యానికి చేరుకోవడంలో ఆటంకాలు ఏర్పడటం ... అయినవాళ్లు ఆపదలో ఉండటం దుఃఖానికి దారితీస్తుంది. అలాంటి దుఃఖం నుంచి విముక్తిని పొందాలంటే ఆదిదేవుడి అనుగ్రహం కావాలి. ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ఆవుపాలతో అభిషేకం చేయాలి.
మానవులు చేసుకున్న పాపాలే వారిని పట్టిపీడిస్తూ దుఃఖానికి గురిచేస్తుంటాయి. ఆ పాపల భారం నుంచి బయటపడేయడం వలన వాళ్లు దుఃఖానికి దూరమవుతారు. అలా పరమశివుడు తనని ఆరాధించిన భక్తులను పాపాల నుంచి విముక్తులను చేస్తుంటాడు. దుఃఖం దూరమయితే సహజంగానే ఆ స్థానాన్ని ఆనందం భర్తీ చేస్తుంది. ఆనందంతో నిండిన మనసు ఆదిదేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది.