ఆషాఢ మాసం ప్రత్యేకత !

ఆషాఢమాసం అనగానే శుభకార్యాలకు మంచిదికాదనే భావనను అందరూ వ్యక్తం చేస్తుంటారు. అయితే దైవ కార్యాలకు సంబంధించినంత వరకూ ఆషాఢ మాసానికి కూడా ప్రత్యేకత లేకపోలేదు. సమస్త లోకాలనేలే జగన్నాథుడి ఉత్సవం పూరీలో అంగరంగ వైభవంగా జరిగేది ఈ మాసంలోనే. అశేష భక్త జనకోటి జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలనుకునే వాటిలో పూరీ జగన్నాథ స్వామి 'రథయాత్ర' ఒకటి. 'ఆషాఢ శుద్ధ విదియ' రోజున ఇక్కడ నేత్రపర్వంగా రథోత్సవం జరుగుతుంది.

ఇక 'ఆషాఢ శుద్ధ పంచమి' ని 'స్కంద పంచమి' అనీ , అలాగే 'ఆషాఢ శుద్ధ షష్ఠి' ని 'కుమార షష్ఠి' అని పిలుస్తుంటారు. ఈ రెండు రోజుల్లోనూ కుమారస్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో షోడశ ఉపచారాలతో పూజించాలని శాస్త్రం చెబుతోంది. ఇక శయన ఏకాదశిగా చెప్పబడుతోన్న 'తొలి ఏకాదశి' రోజున శ్రీమహా విష్ణువును ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని అంటారు. ఈ రోజు నుంచే 'చాతుర్మాస్య వ్రతం' ఆరంభమవుతుంది. అనేక నియమ నిష్ఠలను పాటిస్తూ ఈ వ్రతాన్ని పూర్తి చేయవలసి వుంటుంది.

ఇక విశేషంగా చెప్పబడుతోన్న 'గురు పౌర్ణమి' కూడా ఈ మాసంలోనే పలకరించడం జరుగుతుంది. వేదవ్యాసుని జన్మదినంగా చెప్పబడుతోన్న'ఆషాఢ శుద్ధ పౌర్ణమి' రోజున, ప్రతి ఒక్కరూ తమ గురువుని వ్యాసుడిగా భావన చేసుకుని పూజించాలి. ఇలా కొన్ని పర్వదినాలు ... వ్రతాలు ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఈ మాసంలో చేయబడిన స్నానాలు ... దానాలు ... వ్రతాలు ... ఉపవాసాలు ... ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంటాయి. అందుకే ఆషాఢ మాసాన్ని కూడా ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న మాసంగా చెప్పక తప్పదు.


More Bhakti News